రేవంత్ సర్కారు కు చెడ్డపేరు తెచ్చేలా హైడ్రా అధికారుల కుట్ర : జగ్గారెడ్డి

రేవంత్ సర్కారు కు చెడ్డపేరు తెచ్చేలా హైడ్రా అధికారుల కుట్ర  : జగ్గారెడ్డి

  • హైడ్రా దాడులను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది
  • బీఆర్‌ఎస్‌ అనుకూల అధికారుల కుట్రలపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది
  • కుట్రల అంశాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ దృష్టికి తీసుకెళ్తా
  • త్వరలోనే హైడ్రా బాధితులను కలుస్తా :  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

విశ్వంభర,హైదరాబాద్ :జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను ఓడించడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ హైడ్రాను అడ్డం పెట్టుకొని కుట్రలు పన్నుతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సంగారెడ్డిలో ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొందరు హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. అత్యుత్సాహం చూపుతున్న అధికారులపై హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ దృష్టిపెట్టాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉప ఎన్నికలో లబ్ధిపొందాలని చూస్తోందని వివరించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి సహకరిస్తున్నట్లుగా ఉన్న హైడ్రా అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే హైడ్రా బాధితులను కలుస్తానని, బీఆర్‌ఎస్‌ అనుకూల అధికారుల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇప్పటిదాకా హైడ్రా దాడుల గురించి మాట్లాడని కేటీఆర్‌.. జూబ్లీహిల్స్‌ ఎన్నికల నేపథ్యంలో హైడ్రా జపం చేయడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు.

 

Read More డా. వేదాల శ్రీనివాస్ కు శ్రీ వైష్ణవ విశిష్ట వ్యక్తి పురస్కారం