ధరణి వెనుక భారీ కుట్ర: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోని భూముల రక్షణ కోసం నిర్మించాల్సిన ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డదారిలో వాడుకున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని భూముల రక్షణ కోసం నిర్మించాల్సిన ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డదారిలో వాడుకున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ధరణిలోని లోపాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణిలో జరిగినవి కేవలం సాంకేతిక లోపాలు కావని, కావాలని వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాలని ఆయన స్పష్టం చేశారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కొల్లగొట్టారని, దీనిపై లోతైన విచారణ సాగుతోందని తెలిపారు.
టెర్రాసిస్ బాధ్యతారాహిత్యం.. మాయమైన లాగిన్ వివరాలు
ధరణి పోర్టల్ నిర్వహణను 'టెర్రాసిస్' అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే ప్రధాన సమస్యలు తలెత్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తించారు. సెక్యూరిటీ ఆడిట్ సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అన్నీ సవ్యంగా ఉన్నట్లు గతంలో తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్ వివరాలు మాయమవ్వడం, అనుమానాస్పద లావాదేవీల సమాచారం దొరక్కుండా లాగిన్లనే డిలీట్ చేయడం వంటి అంశాలు విచారణలో బహిర్గతమయ్యాయి. ఫోరెన్సిక్ ఆడిట్‌లో 'కోడ్ ఆడిట్' నిర్వహించలేదన్న విషయం వెలుగులోకి రావడంతో, తక్షణమే పూర్తిస్థాయి కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
భూభారతితో కొత్త శకం.. అక్రమార్కులకు హెచ్చరిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధరణి ముసుగులో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఉండేలా ‘భూభారతి’ పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల తరహాలోనే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల భూములకు పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు.



