అధికార బలంతో అరాచక పాలన.. బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు విమర్శలు

అధికార బలంతో అరాచక పాలన.. బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు విమర్శలు

రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోందని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోందని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించకుండా కిడ్నాప్‌లు, అక్రమ అరెస్టులతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు. క్యాతనపల్లిలో ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్‌కు పట్టం కట్టారని, కానీ ఆ తీర్పును తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని హరీశ్ రావు మండిపడ్డారు.

పదవుల కబ్జా కాంగ్రెస్ నైజం
భూములను కబ్జా చేసినట్లే మున్సిపల్ పదవులను కూడా కబ్జా చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం, వారిని ప్రలోభపెట్టడం వంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇలాంటి అణచివేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా మారడం శోచనీయమని, ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

Read More బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం.-హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసన. - విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకురి సంపత్ వర్మ 

ఐక్య పోరాటానికి పిలుపు
అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అడ్డదారుల్లో పదవుల కోసం ప్రయత్నించడం మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అణచివేత వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కానీ కాంగ్రెస్ మాత్రం దౌర్జన్యాలతో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ పరిణామాలపై తాము చట్టపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని హరీశ్ రావు తేల్చి చెప్పారు.