శ్రీపాదరావు కు ఘనంగా నివాళులు
విశ్వంభర, సూర్యాపేట: దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా యువజన ,క్రీడా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పనిచేసిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవకరమైన విషయమని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి విశిష్ట సేవలందించారు. స్పీకర్ గా ఆయన నిష్పాక్షికత, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావంతో సభా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి విశేషమైనదని సరళత, సమగ్రత, నిబద్ధత ఆయన వ్యక్తిత్వ లక్షణాలుగా నిలిచాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో చూపిన అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవరావు, డీవైఎస్ఓ వెంకట్ రెడ్డి , జడ్పీ సీఈఓ శిరీష, డిఎంహెచ్వో వెంకటరమణ, డిఎమ్ఓ నాగేశ్వర శర్మ, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



