అభివృద్దే లక్ష్యంగా ప్రణాళికలు 

అభివృద్దే లక్ష్యంగా ప్రణాళికలు 

  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

విశ్వంభర,  హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  తెలిపారు. సోమవారం రోజున 48, 49 డివిజన్ల పరిధిలో సుమారు రూ.9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.7.50 కోట్ల వ్యయంతో NIT నుంచి లోటస్ కాలనీ వరకు R&B రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ రహదారి రెండు వైపులా సెంటర్ లైటింగ్ వ్యవస్థతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 48వ డివిజన్‌లో రూ.50 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం, రూ.1.37 కోట్లతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుసూర్ పాషా,హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కూడా పాల్గొన్నారు. అనంతరం   ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. శంకుస్థాపనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న NIT రహదారి పనులు ప్రారంభం కావడంతో ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు.గతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఎవరు పట్టించుకోలేదని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులను సమకూర్చి ప్రత్యేక దృష్టితో ఈ రోజు పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.

Tags: