అంగన్వాడీలకు ఒంటిపూట బడులు వర్తించవా ?

అంగన్వాడీలకు ఒంటిపూట బడులు వర్తించవా ?

  • అంగన్వాడీలకు ఒంటిపూట బడులు వర్తించవా ?

విశ్వంభర, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న వేళ పాఠశాలలకు ఒంటిపూట బడులు అమలవుతున్నాయి. అయితే అదే పరిస్థితి అంగన్వాడి కేంద్రాల విషయంలో మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడంతో జిల్లాలో అంగన్వాడి కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి. మండుతున్న ఎండల్లో చిన్నారులు కేంద్రాల్లో గడపాల్సి రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలల మాదిరిగానే అంగన్వాడి కేంద్రాలకు కూడా ఒంటిపూట సమయం ఎప్పుడు అమలవుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు పాఠశాలలకు ఒంటిపూట బడులు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అదే సమయంలో అంగన్వాడి కేంద్రాలకు సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులు మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడి కేంద్రాలు సాధారణ సమయాల్లోనే కొనసాగుతున్నాయి. అధికారులు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవనే కారణాన్ని చూపుతున్నారు. కేంద్ర నిర్వాహకులు కూడా తమకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారు. ఫలితంగా మండుతున్న ఎండల్లో చిన్నారులు గంటల తరబడి కేంద్రాల్లో ఉండాల్సి వస్తోంది. జిల్లాలో కొన్నిచోట్ల అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ చాలా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇలాంటి కేంద్రాల్లో ఇరుకు గదుల్లో చిన్నారులు ఎక్కువసేపు ఉండాల్సి రావడం ఇబ్బందిగా మారుతోంది. ఎండల తీవ్రత కారణంగా గదుల్లో ఉక్కపోత పెరిగి పిల్లలు అసౌకర్యానికి గురవుతున్నారు. తాగునీరు, గాలి సరైన విధంగా అందకపోవడంతో చిన్నారులు అలసటకు లోనవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాలలకు ఒంటిపూట సమయం అమలవుతుండగా అంగన్వాడీలకు మాత్రం వర్తించకపోవడం వారికి అర్థం కాని విషయమైంది.. వెంటనే ప్రభుత్వం స్పందించి చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎండలు మరింతగా పెరుగుతున్న వేళ పిల్లలను కేంద్రాలకు పంపాలా వద్దా అన్న సందేహంలో తల్లిదండ్రులు ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండే వేడిలో పిల్లలు ఎలా ఉంటారోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వర్తించినట్టే అంగన్వాడి కేంద్రాలకు కూడా ఒంటిపూట సమయం అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఎప్పుడు జారీ చేస్తుందోనన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో వినిపిస్తోంది. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా తక్షణ నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అంగన్వాడి కేంద్రాలకు ఒంటిపూట సమయం అమలు చేస్తేనే పిల్లలకు ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు.

 ప్రభుత్వ ఉత్తర్వులు అందాల్సిందే..

Read More 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన సామాజిక కార్యకర్త

ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఉత్తర్వులు అందలే దు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తరువాతే తదుపరి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ప్రస్తుత విధానమే కొనసాగుతుందని చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్  కె శిరీష తెలిపారు.

Tags: