శాస్త్రోక్తంగా సీత రామ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
విశ్వంభర, సంగారెడ్డి : మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ సొంత నిధులతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిటిఎన్ కాలనీలో నిర్మించిన శ్రీ హనుమ సమేత సీతా రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా, బుధవారం తెల్లవారుజాము నుండే వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9:43 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తాన స్వామి వారి యంత్ర స్థాపన, బింబ స్థాపన, శిఖర స్థాపన ఘట్టాలను అత్యంత వైభవంగా పూర్తి చేశారు. అనంతరం మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ గావించి, నేత్రోన్మీలనము నిర్వహించారు.ఆలయ నిర్మాణంతో పాటు కాలనీలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు నీలం మధు ముదిరాజ్ తీసుకున్న ఈ చొరవను కాలనీ వాసులు కొనియాడుతున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం మూర్తులకు ప్రత్యేక కళా కుంభాభిషేకము, శ్రీ సీతారామ స్వామి దేవతా అర్చనలు నిర్వహించారు. మహానివేదన, మంగళ నీరాజనాల అనంతరం భక్తులకు రక్షాధారణ, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా రామనామ స్మరణతో చిట్కుల్ పుర వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, భక్తులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



