నకిలీ పత్రాలతో ఇళ్ల తనఖా : నిందితుడి అరెస్ట్

నకిలీ పత్రాలతో ఇళ్ల తనఖా : నిందితుడి అరెస్ట్

విశ్వంభర, బండ్లగూడ  : బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లకు సంబంధించిన నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఫిర్యాదు ప్రకారం, నిందితులు తామే ఇంటి యజమానులమని నమ్మబలికి బాధితురాలితో ఇల్లు తనఖా పేరుతో రూ.3 లక్షలు తీసుకున్నారు. అనంతరం వారు అసలు యజమానులు కాదని తెలిసి బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. విచారణలో నిందితులు ముందుగా ఇళ్లను అద్దెకు తీసుకుని, తర్వాత నకిలీ యాజమాన్య పత్రాలు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ ఒమర్ అముది అరెస్టయ్యాడు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన మేరకు, ఆస్తి లావాదేవీల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, డబ్బు చెల్లించే ముందు యాజమాన్య పత్రాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. ఈ కేసు దర్యాప్తు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ పర్యవేక్షణలో, ఏసీపీ ఎ. సుధాకర్ ఆధ్వర్యంలో సాగింది. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ ఆర్. దేవేందర్, ఎస్‌ఐ ఎస్. నాగరాజు రెడ్డి బృందాన్ని అధికారులు అభినందించారు.

Tags: