కొడుకులు పట్టించుకోకపోతే ఫిర్యాదు చేయాలి
విశ్వంభర, సిద్దిపేట: కొడుకులు సక్రమంగా చూసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని త్రీ టౌన్ సీఐ లక్ష్మీబాబు సూచించారు. వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని ముగ్గురు కొడుకులకు సీఐ బుధవారం స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్లితే.. ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పాముకుంట ఎల్లవ్వ-నర్సయ్య దంపతులకు యాదగిరి, కిష్టయ్య, దేవయ్య అనే ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురికి ఆస్తులను సమానంగా పంచినప్పటికీ తమ బాగోగులు పట్టించుకోవడం లేదని ఎల్లవ్వ-నర్సయ్యలు ఈనెల 18తేదీన ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముగ్గురు కొడుకులు, వారి భార్యలను సీఐ లక్ష్మీబాబు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రతీ కొడుకు ప్రాథమిక బాధ్యతని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం నైతికంగా తప్పే కాకుండా చట్టపరంగా శిక్షార్హులని హెచ్చరించారు. కౌన్సిలింగ్ అనంతరం కొడుకులు తమ తల్లిదండ్రులను ఇకపై సక్రమంగా చూసుకుంటామని, ప్రతీ నెల ఖర్చులకు సరైన డబ్బులను అందిస్తామని, ఆరోగ్య సమస్యలస్తే అందరూ కలిసి వైద్యం చేయిస్తామని ఒప్పుకొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సీపీ రష్మీ పెరుమాళ్ వృద్ధుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతీ 15రోజులకోసారి ఖమ్మంపల్లి గ్రామానికి స్వయంగా వెళ్లి వృద్ధ దంపతుల పరిస్థితిని పరిశీలిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వృద్ధ దంపతులు సంతోషం వ్యక్తం చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.



