ఓటీఆర్ గడువు పొడిగించాలి: ఏఐవైఎఫ్ డిమాండ్

ఓటీఆర్ గడువు పొడిగించాలి: ఏఐవైఎఫ్ డిమాండ్

 విశ్వంభర, నాంపల్లి : టీజీపీయస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) గడువును పొడిగించి, దాన్ని నిరంతర ప్రక్రియగా మార్చాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. నాంపల్లిలోని టీజీపీయస్సీ కార్యాలయంలో కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన నాయకులు, రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత సాంకేతిక సౌకర్యాల లేమితో ఈ ప్రక్రియలో వెనుకబడే ప్రమాదం ఉందని తెలిపారు. గడువు విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ, ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను ఓటీఆర్ గడువుతో మరింత నిరాశలోకి నెట్టుతున్నారని విమర్శించారు. ఇది పరిపాలనా వైఫల్యమే కాకుండా యువతపై ప్రభావం చూపే నిర్ణయమని అన్నారు. గ్రామీణ, బడుగు వర్గాల యువతకు మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉచిత నమోదు సదుపాయాలు కల్పించాలని, సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు చేయలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఓటీఆర్ పై చూపుతున్న శ్రద్ధ జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో కనిపించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించడం యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెర్లకంటి శ్రీకాంత్, సిద్ధార్థ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: