నిత్యావసరాల ధరల మంటపై ఆప్ ఆగ్రహం
విశ్వంభర, హిమాయత్ నగర్ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం విమర్శించింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని ఆరోపించింది. ఈ సందర్భంగా హైదరాబాదు హిమాయత్ నగర్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుర్ర రాము గౌడ్ మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజల జీవనం కష్టమైందన్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించకుండా ప్రజలకు ఉపశమనం కల్పించడంలో విఫలమైందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేకపోవడం వల్ల సామాన్యుల జీవనం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించి లీటరుకు రూ.10 ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ‘చలో సెక్రటేరియట్’, బీజేపీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దర్శనం రమేష్, కొడంగల్ శ్రీనివాస్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



