చేనేత సమస్యల పరిష్కారానికి కృషి : కూనంనేని
విశ్వంభర, ముషీరాబాదు : చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని , అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికులు ఆర్థికంగా, రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు చేయడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. చేనేత పరిశ్రమకు తగిన ప్రాధాన్యం కల్పించి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, కార్మికులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నెల్లికంటి సత్యం, తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత కీలక రంగమైన చేనేతను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిఫ్ట్ పథకంలో పెండింగ్ డిపాజిట్లు వెంటనే చెల్లించాలని, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసి జీరో వడ్డీ రుణాలు ఇవ్వాలని కోరారు. బడ్జెట్‌లో చేనేత రంగానికి తగిన నిధులు కేటాయించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. కార్మికులకు బీమా, సబ్సిడీలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. పథకాలను పునరుద్ధరించి కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలడుగు భాస్కర్, వనం శాంతికుమార్, ముషం రమేష్, కూరపాటి రమేష్, గంజి మురళీధర్, లల్లెల బాలకృష్ణ, పైళ్ల ఆశయ్య, పాసికంటి లక్ష్మీనరసయ్య, చోళ రాజేశం, బాసాబత్తిని రాజేశం తదితరులు పాల్గొన్నారు.



