తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి
విశ్వంభర, చింతపల్లి : బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న చింతపల్లి మండల ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు . ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ శంశోద్దిన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు 15 శాతం కూడా నిధులు కేటాయించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యను నిర్వీర్యం చేస్తున్నాడన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేయడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. అరెస్టు అయిన వారిలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎర్ర చిన్న, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.



