జర్నలిస్టుల ర్యాలీ, ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్

జర్నలిస్టుల ర్యాలీ, ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్


  • -వివక్ష విడనాడకపోతే రాష్ట్రవ్యాప్తంగా  ఆందోళన
    - టీ డ బ్ల్యూ జే ఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ

విశ్వంభర, ఖమ్మం :  జర్నలిస్టుల పై వివక్షతను విడనాడాలని ఐ అండ్ పి ఆర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో  ఖమ్మం జిల్లా యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యవైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్ కార్యాలయంను  ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన రాష్ట్రవ్యాప్త జర్నలిస్టుల "ఛలో హైదరాబాద్" కార్యక్రమంలో  వివిధ జిల్లాల నుంచి  పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఅండ్ పీఆర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్బంగా ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. ఈ సందర్బంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్  వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతుందని, జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు.  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమం ఊసే లేదని, కనీసం జర్నలిస్టుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా, నిధులు కేటాయించకుండా దారుణమైన అన్యాయం చేసిందని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేదని,హెల్త్ కార్డులు సైతం ఇవ్వలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఊసే లేదని, సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పుకుంటుందని ఆరోపించారు.  పదవీవిరమణ పొందిన పాత్రికేయులకు అనేక రాష్ట్రాలలో పెన్షన్ ఇస్తుండగా, మన రాష్ట్రంలో ఏ ఒక్కరికీ పెన్షన్ ఇవ్వడంలేదని అన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ ను పూర్తిగా అణిచివేస్తున్నదని, గత రెండేళ్లుగా అడ్వర్టైజ్మెంట్స్ బిల్స్ చెల్లించలేదని ధ్వజమెత్తారు. ఆర్ ఎన్ ఐ, పీఆర్ జిఐ రిజిస్ట్రేషన్ తో నడుస్తున్న అనేక చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయడం లేదని, కనీసం ఆ పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో జర్నలిస్టులకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారని మామిడి సోమయ్య మరియు రామకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వివక్ష చూపుతూ, నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జర్నలిస్టుల చైతన్య యాత్రతో ప్రజల్లోకి వెళతామని మామిడి సోమయ్య రామకృష్ణ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో 33 జిల్లాల్లో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు జర్నలిస్టులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలో ఫెడరేషన్ జిల్లా కౌన్సిల్ సభ్యులు, నగర సభ్యులు వేముల కొండ రమేష్ , మామిడాల వీరబాబు,
వి ఆర్ ఎం వెంకట్,కప్పల మధు గోపాలకృష్ణ ,కిరణ్ పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐఅండ్ పిఆర్ డైరెక్టర్ కిషోర్ బాబు కు అందజేశారు.

Tags: