29న ప్లాటినం జూబ్లీ వేడుకలు

29న ప్లాటినం జూబ్లీ వేడుకలు

  • పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఇ.వి. శ్రీనివాస్ రావు వెల్లడి

విశ్వంభర, హనుమకొండ: వరంగల్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి  70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను ఈ నెల 29న ఘనంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఇ.వి. శ్రీనివాస్ రావు తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 1955 సంవత్సరం నుంచి ప్రస్తుత విద్యార్థుల వరకు 70 సంవత్సరాల కాలానికి చెందిన పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఆత్మీయ సమ్మేళనంగా ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలు. నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేడుకలు పూర్వ విద్యార్థులందరికీ చిరస్మరణీయంగా నిలిచే విధంగా, కన్నుల పండుగలా జరుగనున్నాయని తెలిపారు.
కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలలో వివిధ ఉన్నత స్థానాల్లో స్థిరపడి కళాశాలకు గౌరవం తీసుకువచ్చారని ఆయన అన్నారు. ప్రస్తుతం కళాశాల నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, అందరికీ అనుబంధమైన పాత కళాశాల భవనం వచ్చే 5 సంవత్సరాల నాటికి అందుబాటులో వుండదని ఆ నేపథ్యంలో, ఆనాటి తరగతి గదులు, స్నేహాలు, అనుభవాలను మరోసారి స్మరించుకునే అరుదైన అవకాశంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ వేడుకల ద్వారా పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్ తరాల విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచే విధంగా కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. రాష్ట్రం నలుమూలలతో పాటు దేశ విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ హాజరై ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్, కోశాధికారి ఆనంద్ కుమార్, మహిళా కార్యదర్శి జయశ్రీ, ఉపాధ్యక్షులు సతీష్ రెడ్డి, ఈ. శ్రీనివాస్ రావు, మహేందర్, దొడ్డిపల్లి కుమార్, బాల్నే భావన రిషి, గన్ను సురేందర్, శశి, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: