ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర,సూర్యాపేట: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో వెబెక్స్ ద్వారా జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న6 ఇసుక రిచ్ లలో అక్రమ ఇసుక రవాణా వాహనాలు పట్టుబడితే బైండవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించుట గాను ఆన్లైన్లో నమోదు చేపించాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి పోలీస్, రెవిన్యూ, మైనింగ్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మొబైల్ టీంను ఏర్పాటు చేయాలని, ఈ టీం జిల్లాలోని ఇసుక రిచ్ లో పర్యటిస్తూ అక్రమ ఇసుక రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 729 ఆమోదం పొందిన ఇసుక ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని, సీసీ మరియు ఏఎన్పిఆర్ కెమెరా పర్యవేక్షణతో పాటు ప్రతి సాండ్ టాక్సీ రీచ్‌లో 24 గంటల పర్యవేక్షణ కోసం హై-ఎండ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏదైనా అనధికార వాహనం కెమెరాలో గుర్తిస్తే ఆ వాహనాన్ని బ్లాక్ చేయబడుతుందని, సీసీ కెమెరాతో అమర్చబడిన మొబైల్ వాహనం ద్వారా రీచ్ పరిసర ప్రాంతాలలో నిరంతరం సంచరిస్తూ అక్రమ ఇసుక రవాణాను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు వారానికి కనీసం రెండు సార్లు రీచ్‌లను తప్పనిసరిగా సందర్శించాలని, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, 1 నుండి ఇసుక సరఫరాకు మ్యాన్యువల్ ఉండదని ఆన్ లైన్ ట్రాన్సిస్ట్ పాస్ సిస్టమ్(ఓటిపిఎస్), మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, గ్రామపంచాయతీ సెక్రటరీ ఇసుక ఎంత కావాలో నిర్ధారిస్తే, సంబంధిత తహసిల్దార్ పర్యవేక్షణలో ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు, మైనింగ్ ఏడి విజయ రామారావు, డిపిఓ యాదగిరి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



