అక్రమ కొబ్బరి పొడి కేంద్రంపై దాడి

అక్రమ కొబ్బరి పొడి కేంద్రంపై దాడి

 విశ్వంభర, గోషామహల్ : బేగంబజార్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న కొబ్బరి పొడి తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఒకరిని అరెస్టు చేశారు. సుమారు రూ.21 లక్షల విలువైన కొబ్బరి పొడి నిల్వలు, ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నకుల్ మరోటియా (31) అనే వ్యక్తి నాణ్యతలేని కొబ్బరి పొడిని తక్కువ ధరకే కొనుగోలు చేసి, ‘చేతక్’ బ్రాండ్ పేరుతో ప్యాక్ చేసి అసలైనదిగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, గడువు తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  లైసెన్స్ వివరాలు లేకుండా విక్రయిస్తూ వినియోగదారులను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడిలో 8,300 కిలోల కొబ్బరి పొడి, మూడు సీలింగ్ ప్యాకింగ్ యంత్రాలు, మూడు తూకం యంత్రాలు, 400 ప్యాకింగ్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 92/2026 కింద సెక్షన్ 318(4), 274 బీఎన్‌ఎస్ , సెక్షన్ 57(ii) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ అదనపు డీసీపీ అందే శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. ఇన్‌స్పెక్టర్లు ఆర్. వెంకటేష్, పి. రాఘవేంద్ర, బి. శ్రవణ్ కుమార్, ఎస్‌ఐలు బి. రవికుమార్, ఎ. కృష్ణ, ఎం. మనీషా తదితరులు పాల్గొన్నారు.

Tags: