వేతన హామీ అమలు చేయాలి : విఓఏల డిమాండ్
విశ్వంభర, ముషీరాబాదు : ఐకెపి విఓఏలకు రూ.20,000 వేతనం వెంటనే అమలు చేయాలని, పెండింగ్ చెల్లింపులు విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఐకెపిఓఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడారు. కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ అధ్యక్షతన పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు వేతనాలను పెంచి బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కోరారు. గ్రామ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విఓఏలకు తగిన వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌లు వెంటనే విడుదల చేసి, ప్రతి నెలా వేతనాలను క్రమంగా ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. విఓఏలను ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలని అన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ పని భారం పెరుగుతున్నప్పటికీ తగిన వేతనం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతన పెంపు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగూరు రాములు, పాలడుగు సుధాకర్, జి. పద్మ, సుమలత, అంజి, దుర్గయ్య, వెంకటయ్య, సుధాకర్, కుమార్, చంద్రలీల, కిష్టయ్య, అంజనీయులు, బుద్దా, మౌనిక తదితరులు పాల్గొన్నారు.



