అంబేద్కర్ విగ్రహానికి ఆశావర్కర్ల వినతి
విశ్వంభర, ఇనుగుర్తి: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రం ఇనుగుర్తి లోని అంబేద్కర్ విగ్రహానికి మండల ఆశా వర్కర్లు బుధవారం వినతి పత్రం అందజేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి జల్లె జయరాజ్ నిరసనలో పాల్గొని మద్దతు ప్రకటించి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖకు వెన్నెముకగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు నెల నెల రూ.18,000 స్థిర వేతనం చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.రూ.50 లక్షలు బీమా కల్పించాలన్నారు.విధుల్లో ఉంటూ మృతి చెందిన ఆశ వర్కర్ లకు దహన సంస్కారాలకు రూ.50 వేలు చెల్లించాలని కోరారు. సీనియార్టీ మేరకు ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని,ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉన్న పారితోషకాన్ని వెంటనే అందించాలన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.



