30 న భూమి హక్కు సభ 

30 న భూమి హక్కు సభ 

విశ్వంభర, బషీర్ బాగ్: అసైన్డ్ భూముల యాజమాన్య హక్కుల సాధనకై ఈ నెల 30 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో “భూమి హక్కు సభ” నిర్వహిస్తున్నట్లు పలు దళిత సంఘా లు వెల్లడించాయి. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ భూ రక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు చింత స్వామి, సలహాదారు రాములు, రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైనయ్యలు  సభ కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వంచిన అన్ని రకాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి పేదలకే పంపిణీ  చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ద్వారా సేకరించిన భూములకు లేఔట్లు చేసి, దానిలో సగభాగం లబ్దిదారులకు ఇవ్వాలన్నారు. భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి 1 ఎకరం భూమిని పంపిణీ చేయాలన్నారు. అసైన్డ్ భూముల కమీషన్ నియమించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేవడతామని వారు హెచ్చరించారు.  ఈ సమావేశంలో మూసీ నది పరిరక్షణ సమితి అధ్యక్షుడు మూసీ శంకరన్న, చిట్టిపాక ప్రభాకర్, డా.  నర్సన్న, రోజారాణి, బోట్ల శ్రీను, జీవనజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags: