కల్తీ ఆహార ముఠాల గుట్టురట్టు : ఆరుగురు అరెస్ట్

కల్తీ ఆహార ముఠాల గుట్టురట్టు : ఆరుగురు అరెస్ట్

విశ్వంభర, హైదరాబాదు : నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ప్రమాదకర రసాయనాలతో ఆహారం తయారు చేస్తున్న ఆరు మందిని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్, ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారులు సంయుక్తంగా రాజేంద్రనగర్ పరిధిలోని ఎం.ఎం. పహాడీలో దాడి నిర్వహించి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ కలర్ కలిపి తయారు చేసిన సుమారు 70 క్వింటాళ్ల పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కాటెదాన్‌లో అక్రమంగా నడుస్తున్న ఆహార తయారీ కేంద్రంపై దాడి చేసి కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో డోనట్స్, కేకులు తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో రసాయనాలు, తయారైన ఆహార పదార్థాలు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో పట్టుబడిన నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించి కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో కల్తీ ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags: