రూ.60 లక్షల నాన్ డ్యూటీ లిక్కర్ ధ్వంసం

విశ్వంభర, శంషాబాద్ : ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. శంషాబాద్ పరిధిలో రూ.60 లక్షల విలువైన మద్యం బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. గత ఆరు నెలల్లో 103 కేసుల్లో 6,859 మద్యం బాటిళ్లు, 44 బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3,077 లీటర్ల మద్యం పట్టుబడగా, పంచుల సమక్షంలో ఎక్సైజ్ స్టేషన్ వద్ద రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్, సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఢిల్లీ, గోవా, హర్యానా ప్రాంతాల నుంచి తక్కువ ధరల ఆశతో మద్యం తెస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో మరో రూ.5.80 లక్షల విలువైన 232 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 25 మందికి నోటీసులు జారీ చేశారు. అలాగే కూకట్‌పల్లి ప్రాంతంలో మద్యం దుకాణంపై దాడి చేసి ఏపీకి చెందిన 15 బ్రీజర్ బాటిళ్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం రవాణా, నిల్వలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Tags: