మిర్యాలగూడలో కామాఖ్యా అమ్రిత్ భారత్ ఎక్సప్రెస్ ను ఆపాలి
- : రైల్వే మంత్రికి లేఖ రాసిన వెంకన్న యాదవ్
విశ్వంభర, మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర బీసీవై పార్టీ పీఏసీ సభ్యుడు, మిర్యాలగూడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బొడ్డు వెంకన్న యాదవ్ ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి–కామాఖ్య అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో ఆపాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి వినతి పత్రం సమర్పించారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు ముఖ్య రైల్వే కేంద్రంగా ఉండటమే కాకుండా సూర్యాపేట జిల్లాకు సౌకర్యంగా ఉందని తెలిపారు. “తెలంగాణ రైస్ హబ్” గా పేరుగాంచిన ఈ ప్రాంతంలో అనేక బియ్యం మిల్లులు, సిమెంట్ కర్మాగారాలు ఉండి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పనిచేస్తుండగా, రైలు ఆగకపోవడం వల్ల వారికి స్వగ్రామాలకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదనంగా, మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన అనేక మంది విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున, ఈ రైలుకు నిలుపుదల కల్పిస్తే వారి ప్రయాణం సులభమవుతుంది. అంతేకాకుండా, ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది భక్తులు, ముఖ్యంగా ఆర్య వైశ్య సమాజానికి చెందిన వారు కామాఖ్య అమ్మవారిని తమ ఇంటి దేవతగా భావించి తరచుగా కామాఖ్య దేవాలయానికి యాత్రలు చేస్తుంటారని, ఈ రైలు వారికి ముఖ్యమైన అనుసంధానంగా ఉంటుందని తెలిపారు.



