మహిళలకు అవకాశం కల్పించాలి
విశ్వంభర, బషీర్ బాగ్: బాబాసాహెబ్ డా. బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాల కమిటీ చైర్ పర్సన్ గా మహిళలకు ప్రత్యేకించి మాల మహిళలకు ప్రాధాన్యత నివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్, ఓయూ అధ్యాపకులు డా. మంచాల లింగస్వామి డిమాండ్ చేశారు. జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం యువజన విభాగం అధ్యక్షులు దాసరి విశాల్ తో కలసి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ లో నిర్వహించబోయే బాబాసాహెబ్ డా. బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్ పర్సన్ గా మహిళలకు ప్రత్యేకించి మాల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళా అభివృద్ధి దేశాభివృద్ధి అని పునరుద్ఘాటించిన అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ ప్రతి ఏడాది జయంతి ఉత్సవాల కమిటీ చైర్ పర్సన్ గా పురుషులకే పదవులు కట్టబెడుతున్నారన్నారు. మహిళాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నామని చెబుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారైనా జయంతి ఉత్సవాల కమిటీ చైర్ పర్సన్ గా మహిళలకు అవకాశం ఇవ్వాలని కోరారు. మాటల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం చేతల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు పుణ్య భాను ప్రకాష్, ఆదర్శ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు వినయ్ కుమార్, జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం వైస్ ప్రెసిడెంట్ కే. ఉమాకాంత్, ఆదర్శ మహిళా సేవా సంఘం లావణ్య, తెలంగాణ మహిళా సంక్షేమ సంఘం రాజమణి, మాల మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.



