పాక్‌ గడ్డపై రాఫెల్ విధ్వంసం

ఆపరేషన్ సిందూర్‌లో అసలైన 'హీరో' మన ఫైటర్ జెట్లే 

పాక్‌ గడ్డపై రాఫెల్ విధ్వంసం

భారత గడ్డపై ఉగ్రవాదానికి పాల్పడితే ప్రతిచర్య తప్పదని, శత్రువుల మూలాలను వెతికి మరీ కొడతామని భారత వైమానిక దళం (IAF) మరోసారి స్పష్టం చేసింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భారత గడ్డపై ఉగ్రవాదానికి పాల్పడితే ప్రతిచర్య తప్పదని, శత్రువుల మూలాలను వెతికి మరీ కొడతామని భారత వైమానిక దళం (IAF) మరోసారి స్పష్టం చేసింది. బుధవారం జరిగిన 'ఎక్సర్‌సైజ్ వాయుశక్తి 2026' ఆవిష్కరణ కార్యక్రమంలో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ మాట్లాడుతూ.. గత ఏడాది పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సాగిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) లో రాఫెల్ ఫైటర్ జెట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయని కొనియాడారు. ఈ ఆపరేషన్‌లో రాఫెల్ జెట్లు అసలైన 'హీరో'గా నిలిచాయని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

రాఫెల్ జెట్లతో శత్రువుల గుండెల్లో వణుకు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ జెట్లు తన శౌర్యాన్ని నిరూపించుకున్నాయని నాగేష్ కపూర్ పేర్కొన్నారు. అత్యాధునిక స్కాల్ప్ (SCALP) క్షిపణులు, హ్యామర్ బాంబులను ఉపయోగించి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు, వైమానిక స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భారత వైమానిక దళం తన శక్తిని మరింత పెంచుకోవడానికి మరిన్ని మల్టీ రోల్ ఫైటర్ జెట్ల (MRFA) కొనుగోలుపై దృష్టి పెట్టింది. అవి రాఫెల్ కావొచ్చు లేదా మరేదైనా కావొచ్చు, ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ జెట్ల డీల్ గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read More రాష్ట్ర అధికారులకు కేంద్రం 'ఐఏఎస్' వరం

మరోసారి యుద్ధనైపుణ్యాల ప్రదర్శన
రాబోయే ఫిబ్రవరి 27న జైసల్మేర్‌లోని పోఖ్రాన్ కాల్పుల పరిధిలో జరగనున్న 'వాయుశక్తి 2026' విన్యాసాల్లో ఆపరేషన్ సిందూర్ నాటి పోరాట దృశ్యాలను ప్రజల కోసం ప్రదర్శించనున్నట్లు ఎయిర్ మార్షల్ తెలిపారు. ఈ ప్రదర్శనలో 120కి పైగా యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, భారత భూభాగంపై దాడికి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఈ విన్యాసాల ద్వారా ప్రపంచానికి గట్టి సందేశం పంపనున్నారు.

Tags: