ఆస్తులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదు: భట్టి విక్రమార్క
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కట్టుకథలు, ఆధారంలేని ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించేలా వార్తలు ప్రచురిస్తే భయపడి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కట్టుకథలు, ఆధారంలేని ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించేలా వార్తలు ప్రచురిస్తే భయపడి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తూ ఒక పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క ఈ అంశంపై విస్తృతంగా మాట్లాడారు.
తాను రాజకీయాల్లోకి వచ్చినది ఆస్తులు కూడబెట్టుకోవడానికో, వ్యాపార ప్రయోజనాలు పొందడానికో కాదని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆస్తులు, సహజ వనరులు ప్రజలందరికీ సమానంగా అందేలా చూడటమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను కాపాడుతూ, వాటిని పారదర్శకంగా వినియోగించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.
నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలని సింగరేణి సంస్థకు సూచనలు ఇచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థే తప్ప, మంత్రి లేదా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు గనులు ఉన్న ప్రాంతం భౌగోళికంగా క్లిష్టమైనది కావడంతో, టెండర్లలో ఫీల్డ్ విజిట్ నిబంధనను తప్పనిసరి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విధమైన నిబంధనలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో కూడా అమల్లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
సింగరేణి సంస్థ ప్రజల ఆస్తి అని, బొగ్గు గనులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రానికి చెందిన వనరులను గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి రక్షించడమే తన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. మీడియా సంస్థల మధ్య ఉన్న అంతర్గత విషయాలు లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధుల పేర్లు అనవసరంగా లాగొద్దని ఆయన హెచ్చరించారు.
వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాయడానికి ఎవరికీ హక్కు లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంబంధం లేకుండా తన పేరును ఆ కథనంలో ప్రస్తావించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పత్రికలో వచ్చిన వార్త వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం పూర్తిగా అర్థమైన తర్వాత, అన్ని వివరాలను ప్రజల ముందుంచుతానని తెలిపారు.
అలాగే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను ఆయనకు సన్నిహితుడైన తనపై చూపిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే, ఇలాంటి అసత్య ప్రచారాలకు భయపడి తాను ఎప్పటికీ లొంగిపోయే వ్యక్తిని కాదని భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు.



