తీగలసాగర్ చెరువులో చేపల మృతి

తీగలసాగర్ చెరువులో చేపల మృతి

విశ్వంభర,  పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జిహెచ్ఎంసి పరిధిలోని తీగల సాగర్  చెరువులో విషాదం నెలకొంది. చెరువులోని చేపలు ఆకస్మికంగా మరణించడంతో మత్స్యకారులకు భారీ నష్టం వాటిల్లింది.సుమారు రూ.5 లక్షల వరకు ఆర్థిక నష్టం జరిగి ఉంటుందని చెరువు నిర్వాహకులు పెద్దబోయిన ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు పరిసరాల్లో ఉన్న భ్రమరాంబిక కాలనీ, వి ఎస్ ఆర్ హోమ్స్, ఎల్లంకి కాలేజీ నుండి వస్తున్న మురికినీరు నేరుగా చెరువులోకి చేరడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని బాధితుడు ఆరోపిస్తున్నారు. గతంలో బిజెపి నాయకులు ఎడ్ల రమేష్ ఈ చెరువును ఆనుకుని ప్రభుత్వ భూమిలో ఒక వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఆ వెంచర్  చుట్టుపక్కల కాలనీలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, ఆ మురికినీటిని చెరువులోకి మళ్లించారు.ఈ కలుషిత నీటి ప్రభావంతోనే చెరువులోని చేపలు ఊపిరాడక మృత్యువాత పడ్డాయి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సాదుకున్న చేపలు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో ప్రసాద్ కన్నీరు మున్నీరయ్యారు. సంబంధిత కాలనీ నిర్వాహకులు , బాధ్యులు తనకు జరిగిన  నష్టాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి, చెరువులోకి డ్రైనేజీ నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags: