ప్రజలందరూ చల్లగా ఉండాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- బంధంకొమ్ము లో ఘనంగా సమ్మక్క జాతర
విశ్వంభర, సంగారెడ్డి: అమీన్పూర్ సమ్మక్క సారలమ్మల కృపతో పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బంధం కొమ్ములో గల సమ్మక్క సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనం పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేడారం వెళ్లలేని భక్తుల కోసం బంధం కొమ్ములో స్వయం భూగా వెలసిన అమ్మవార్లకు ప్రత్యేక గద్దెలు నిర్మించి గత రెండు దశాబ్దాలుగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



