గ్రూప్-1 నియామకాలపై తీర్పు వాయిదా
రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన గ్రూప్-1 నియామకాల భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన గ్రూప్-1 నియామకాల భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో గురువారం తీర్పు వెలువరించాల్సిన తెలంగాణ హైకోర్టు.. దానిని ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. తీర్పు కాపీ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడమే దీనికి కారణమని న్యాయస్థానం వెల్లడించింది. జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ మేరకు న్యాయవాదులకు సమాచారం అందించింది.
అసలు వివాదం ఏమిటి?
గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని, పారదర్శకత లోపించిందని గతంలో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గతంలో ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మార్కుల తుది జాబితాను, జనరల్ ర్యాంకులను రద్దు చేయాలని ఆదేశించారు. సమాధాన పత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలని, అది సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సంచలన తీర్పు ఇచ్చారు. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ తో పాటు ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం.. అప్పట్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ, నియామక ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, అయితే అవి తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కేసుపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. నేడు వెలువడాల్సిన తుది తీర్పు ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు వెలువరించే తీర్పు ఆధారంగానే ఇప్పటికే ఎంపికైన వారి నియామక పత్రాలు ఖరారు కానున్నాయి. ఒకవేళ కోర్టు సింగిల్ బెంచ్ తీర్పునే సమర్థిస్తే ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది.



