ఫిలింనగర్‌లో పౌరాణిక జాతర వైభవం

ఫిలింనగర్‌లో పౌరాణిక జాతర వైభవం

విశ్వంభర, ఫిలింనగర్‌ : ఉగాది సందర్భంగా ఫిలింనగర్ డాక్టర్ రామానాయుడు కళామండపంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల ‘పౌరాణిక జాతర’ ఆకట్టుకుంటోంది. ఈ సందర్బంగా  సినీ నిర్మాత కే.ఎస్. రామారావు మాట్లాడుతూ, పౌరాణిక నాటక కళను పునరుద్ధరించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని  పేర్కొన్నారు.  పొత్తూరి వేంకట సుబ్బారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా రెండో రోజు ‘శ్రీ చెంచులక్ష్మి’ నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నరసింహస్వామిగా నిమ్మగడ్డ మీరయ్య, లక్ష్మీదేవిగా జి. పవన్ కుమార్, చెంచులక్ష్మిగా వై. మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. సంగీత సహకారం కూడా ప్రత్యేకంగా నిలిచింది. మొదటి రోజు ‘భక్త ప్రహ్లాద’ నాటకం విజయవంతమైందని, రెండో రోజు ప్రదర్శనకు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పౌరాణిక జాతర మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది.

Tags: