రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర

రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారీ కుట్రకు తెరలేపింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారీ కుట్రకు తెరలేపింది. జనవరి 26న దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో భీకర దాడులు చేసేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌తో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడుల వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26) విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా '26-26' పేరును నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  జమ్మూ కశ్మీర్, దిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. నిందితులు సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ, యువకులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

అప్రమత్తమైన భద్రతా బలగాలు
ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ నిఘాను ముమ్మరం చేసింది. పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలతో దిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

Read More  Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్..!!