ఐ-ప్యాక్ ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
కోల్‌కతా కేంద్రంగా సాగుతున్న ఈడీ వర్సెస్ బెంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: కోల్‌కతా కేంద్రంగా సాగుతున్న ఈడీ వర్సెస్ బెంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐ-ప్యాక్ కార్యాలయంలో సోదాలకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న వైనంపై సుప్రీంకోర్టులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. ఈ వివాదంలో ఉన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర యంత్రాంగం, ఉన్నత స్థాయి పోలీసు అధికారులకు నోటీసులు పంపింది. అధికారుల విధులను ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈడీ అధికారులకు ఊరట
ఐ-ప్యాక్ ప్రాంగణంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈడీ అధికారులపైనే బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు, ఆ ఎఫ్ఐఆర్‌పై స్టే విధించింది. దీనివల్ల ప్రస్తుతానికి ఈడీ అధికారులపై పోలీసు చర్యలు తీసుకునే వీలు లేకుండా పోయింది. ఐ-ప్యాక్ కార్యాలయం, దాని పరిసరాల్లో ఉన్న అన్ని సీసీ టీవీ దృశ్యాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సోదాల సమయంలో అసలు ఏం జరిగిందనే వాస్తవాలు బయటకు రావాలంటే ఈ ఫుటేజీనే కీలక సాక్ష్యం కానుంది. మరోవైపు ఈ కేసును కోల్‌కతా హైకోర్టులోనే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగపరమైన అంశాలు ముడిపడి ఉన్నందున తామే స్వయంగా విచారిస్తామని స్పష్టం చేసింది.



