ఉగ్రవాదంపై ‘ప్రహార్’
దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీనికోసం సరికొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీనికోసం సరికొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ‘ప్రహార్’ పేరుతో రూపొందించిన ఈ వ్యూహం ద్వారా ఆధునిక ఉగ్రవాద సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఉగ్రవాదానికి మతం, జాతీయత లేదా నిర్దిష్ట సమాజం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. భారతదేశం అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండిస్తుందని, హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏ రూపంలోనైనా వచ్చే ఉగ్రవాద ముప్పును అడ్డుకునేందుకు జీరో-టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రహార్‌తో ఆధునిక ముప్పులకు చెక్
ముఖ్యంగా సాంకేతికతను వాడుకుంటూ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను తిప్పికొట్టడమే ‘ప్రహార్’ ప్రధాన ఉద్దేశ్యం. దాడులు జరగకముందే నివారించడం, ఏదైనా ఘటన జరిగినప్పుడు సత్వరమే ప్రతిస్పందించడం, కేంద్ర, రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థల మధ్య మెరుగైన సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటివి ఈ వ్యూహంలో కీలక భాగాలుగా ఉన్నాయి. ఆధునిక కాలంలో ఉగ్రవాదులు వాడుతున్న డ్రోన్లు, డిజిటల్ సాధనాలు, హైటెక్ ముప్పులను ఎదుర్కోవడానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. చట్టపరమైన నిబంధనలను పక్కాగా అమలు చేస్తూనే, అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలతో భాగస్వామ్యం వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఆర్థిక వనరులను తుడిచిపెట్టడం కూడా ఈ వ్యూహంలో భాగంగా ఉంది.
ముగింపు దశకు ఆపరేషన్ కగార్
మరోవైపు అంతర్గత భద్రతకు పెనుసవాలుగా మారిన మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు ఇప్పటికే ‘ఆపరేషన్ కగార్’ పేరుతో భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. వచ్చే మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించిన హోం మంత్రిత్వ శాఖ, ఆలోపే కీలక ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్ సహా ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా దళాలు ఇప్పటికే ముమ్మర దాడులు నిర్వహిస్తూ ఏరివేత కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. అడవుల్లో నక్కిన మావోయిస్టులను లొంగిపోయేలా చేయడం లేదా వారిని ఏరివేయడం ద్వారా దేశంలో శాంతిభద్రతలను పటిష్టం చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది.



