25న ఆందోళన దినంగా నిర్వహించాలి

25న ఆందోళన దినంగా నిర్వహించాలి

విశ్వంభర, హైదరాబాదు :  దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25న  ఆందోళన దినంగా నిర్వహించాలని భారతీయ మజ్జూర్ సంఘ్ నిర్ణయించిందని ఆ సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎస్. మల్లేశం తెలిపారు. పూరి, ఒడిశాలో జరిగిన 21వ అఖిల భారతీయ మహాసభల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ బి యంఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాం రెడ్డి, హైదరాబాదు జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్. మల్లేశం మాట్లాడుతూ దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బీయంఎస్ యూనిట్లు ధర్నాలు, నిరసనలు నిర్వహించి వివిధ రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. లక్షలాది మంది మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు అతి తక్కువ పారితోషికంతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆంగన్వాడీ కార్మికులను ఇప్పటికీ “స్కీమ్ కార్మికులు”గానే పరిగణించడం అన్యాయమన్నారు. రోజుకు పది గంటలకు పైగా పనిచేస్తూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గౌరవ వేతనాల పెంపుపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అంత్యోదయ భావనకు అనుగుణంగా అన్ని రంగాల్లో కార్మిక చట్టాలను కఠినంగా, సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ను తక్షణమే నిర్వహించి త్రైపాక్షిక కమిటీలను పునర్వ్యవస్థీకరించి సమర్థవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ కవరేజీ పరిమితులను పెంచి మరింత మంది కార్మికులకు ప్రయోజనాలు కల్పించాలని, కనీస పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.7500కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి యం ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్, జిహెచ్ ఎం సి యూనియన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: