రజకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
విశ్వంభర, చిక్కడపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రాజక (చాకలి) కులస్థులపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుడిలోకి టికెట్ లేకుండా ప్రవేశించారనే సాకుతో గణేష్, చంద్రకళ, మౌనికలపై కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. ఈ ఘటనలో రెండు నెలల పసిపాప మృతి చెందినట్లు తెలిపారు. సోమవారం హైదరాబాదు చిక్కడపల్లిలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రపూల్ రాంరెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన అమానుషమని పేర్కొన్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, తగిన నష్టపరిహారం అందించాలని కోరారు. దాడికి పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు పంచేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో దళిత బహుజనులపై అగ్రకుల దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలు, బస్తీల్లో కుల వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం దళిత బహుజన ప్రజాస్వామిక శక్తులతో చర్చలు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళ్లెపు చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ కుల దురహంకారంతో జరిగే దాడులు సమాజానికి మచ్చ అని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ఘటనలు ఆగవని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ సమావేశంలో మోహన్ బైరాగి, పిడమర్తి లింగయ్య ఉపాధ్యక్షులు, తుకవ అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర నాయకుడు ఈట్టే ప్రభాకర్, మల్లేష్ ఎన్, సాగర్, రవి తదితరులు పాల్గొన్నారు.



