ఫోన్, ఇంటర్నెట్ వాడని అజిత్ డోవల్
ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్న ఫోన్‌తో, ఇంటర్నెట్ వేగంతో పరుగులు తీస్తోంది.
విశ్వంభర నేషనల్ బ్యూరో: ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్న ఫోన్‌తో, ఇంటర్నెట్ వేగంతో పరుగులు తీస్తోంది. కానీ, భారతదేశపు అత్యంత శక్తివంతమైన భద్రతా అధికారి, 'ఇండియన్ జేమ్స్ బాండ్' అని పిలవబడే అజిత్ డోవల్ మాత్రం వీటికి ఆమడ దూరంలో ఉంటారు. ఇటీవల జరిగిన 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్'లో ఆయన చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
టెక్నాలజీకి దూరంగా
నేటి కాలంలో ఫోన్ లేకుండా నిమిషం గడపడం కష్టం. కానీ డోవల్ గారు మాత్రం "నేను ఇంటర్నెట్ వాడను, ఫోన్ కూడా దాదాపు ఉపయోగించను" అని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో లేదా అత్యవసరంగా విదేశీ ప్రతినిధులతో మాట్లాడాల్సి వస్తే తప్ప ఫోన్ జోలికి వెళ్లనట్లు పేర్కొన్నారు. మరి కమ్యూనికేషన్ ఎలా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రజలకు తెలియని కమ్యూనికేషన్ మార్గాలు ఎన్నో ఉన్నాయి, తాను వాటినే నమ్ముతానని అజిత్ డోవల్ పేర్కొన్నారు. సమాచార భద్రత అత్యంత కీలకం కాబట్టి.. ఆయన తన విధులను డిజిటల్ ప్రపంచానికి అతీతంగా ప్లాన్ చేసుకుంటారు.
సామాన్యుడి నుంచి సెక్యూరిటీ అడ్వైజర్ వరకు
1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన అజిత్ డోవల్.. 1968లో ఐపీఎస్ అధికారిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేరళ క్యాడర్‌కు చెందిన ఆయన.. తన కెరీర్‌లో అత్యధిక భాగం నిఘా, అంతర్గత భద్రతా విభాగాల్లోనే గడిపారు. అతి పిన్న వయసులోనే పోలీస్ విభాగంలో అత్యున్నతమైన 'కీర్తి చక్ర' పురస్కారాన్ని అందుకున్నారు. మిజోరం, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని, తిరుగుబాట్లను అణచివేయడంలో ఆయన చాణక్య నీతి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. భారతదేశం గర్వంగా చెప్పుకునే ఎన్నో సాహసోపేత నిర్ణయాల వెనుక అజిత్ డోవల్ మాస్టర్ మైండ్ ఉంది. 2016 సర్జికల్ స్ట్రైక్స్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన వైమానిక దాడుల పర్యవేక్షణలో అజిత్ డోవల్ పాత్ర మరవలేనిది.



