జమ్ము-కాశ్మీర్ సరిహద్దులో కలకలం
పట్టుబడ్డ పాక్ బెలూన్.. డ్రోన్ల చొరబాటు విఫలం
జమ్ము-కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి గూఢచర్య ప్రయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కథువా జిల్లాలో ఒక అనుమానాస్పద బెలూన్ లభించగా, ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.
విశ్వంభర, నేషనల్, బ్యూరో: జమ్ము-కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి గూఢచర్య ప్రయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కథువా జిల్లాలో ఒక అనుమానాస్పద బెలూన్ లభించగా, ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. కథువా జిల్లా పరిధిలోని పహర్‌పూర్ ప్రాంతంలో ఎరుపు రంగులో ఉన్న ఒక హృదయాకార (Heart shape) బెలూన్‌ను భద్రతా బలగాలు సోమవారం స్వాధీనం చేసుకున్నాయి. ఈ బెలూన్ పాకిస్తాన్ వైపు నుంచే గాలికి కొట్టుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గతంలో అర్నియా సెక్టార్‌లో కూడా ఇటువంటి బెలూన్లు లభించిన నేపథ్యంలో, వీటి ద్వారా ఏవైనా రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా బెలూన్లు, డ్రోన్లు కనిపించడం వెనుక పాక్ ఉగ్రవాద సంస్థలు లేదా గూఢచారి సంస్థల హస్తం ఉండవచ్చని, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, కరెన్సీని భారత భూభాగంలోకి చేరవేస్తారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
డ్రోన్ల చొరబాటుకు సైన్యం చెక్
బెలూన్ కనిపించడానికి ఒకరోజు ముందు (ఆదివారం రాత్రి), రాజౌరి జిల్లాలోని నౌషేరా-రాజౌరి సెక్టార్ వద్ద సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన కొన్ని అనుమానాస్పద పాకిస్తాన్ డ్రోన్లను భారత సైన్యం గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన సైనికులు మెషీన్ గన్‌లతో కౌంటర్ ఎటాక్ ప్రారంభించడంతో, ఆ డ్రోన్లు వెనుదిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. జంగర్, కలాల్ ప్రాంతాల్లో భారీగా కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. ఇదే సమయంలో సాంబ, పూంచ్ జిల్లాల్లో కూడా డ్రోన్ల కదలికలు ఉన్నట్లు నివేదికలు అందినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, BSF బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సరిహద్దు గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



