Himachal Pradesh bus accident: ఘోర బస్సు ప్రమాదం... 12 మంది మృతి..!!
Himachal Pradesh bus accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Himachal Pradesh bus accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బస్సు సిమ్లా నుంచి కుప్వీ వైపు ప్రయాణిస్తోంది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ‘పోష్’ పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హరిపుర్‌ధార్ మార్కెట్ సమీపంలో మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో బస్సు మలుపు వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉండటంతో డ్రైవర్‌కు రహదారి స్పష్టంగా కనిపించకపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లోయలో పడిన బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్థులు సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. గాయపడిన వారిని నాహన్, రాజ్‌గఢ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘోర ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.




