పురుషులకు ఉచిత సిటీ బస్సు ప్రయాణం..!!

పురుషులకు ఉచిత సిటీ బస్సు ప్రయాణం..!!

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే రాజకీయంగా చురుకుగా మారింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే రాజకీయంగా చురుకుగా మారింది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి పార్టీ భవిష్యత్ దిశను స్పష్టంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆకట్టుకునే ఐదు కీలక హామీలను ఆయన ప్రకటించారు.

అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే సామాన్య ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకువస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు. అందులో భాగంగా పురుషులకు ఉచితంగా సిటీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. అలాగే ప్రతి కుటుంబంలోని మహిళకు నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందించే ‘మగళీర్ కులవిళక్కు’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. మహిళల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు.

Read More  బీజేపీతో పొత్తుండదు.. కమలం సైద్ధాంతిక శత్రువు..!!

ఇళ్ల సమస్యపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వంత ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల పంపిణీ ద్వారా పేదలకు నివాస భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ జంటలకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించి, సామాజిక న్యాయాన్ని మరింత బలపరుస్తామని తెలిపారు. మహిళల స్వావలంబన కోసం ‘అమ్మ టూ వీలర్ స్కీమ్’ కింద ఐదు లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.25,000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా పళనిస్వామి డీఎంకేపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రకటించిన పథకాలనే డీఎంకే కాపీ చేసి అమలు చేస్తోందని ఆరోపించారు. తమ పాలనలో ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధంగా నడిపామని, కరోనా వంటి కష్టకాలంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు నిలిచిపోకుండా అందించామని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి అన్నాడీఎంకేకు అవకాశం ఇస్తే, మరింత బలమైన పాలన అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.bus

Tags: