‘జన నాయగన్‌’కు మళ్లీ చుక్కెదురు!

‘జన నాయగన్‌’కు మళ్లీ చుక్కెదురు!

దళపతి విజయ్‌ కథానాయకుడిగా, దర్శకుడు హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘జన నాయగన్‌’ చిత్రానికి సెన్సార్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.

విశ్వంభర, సినిమా బ్యూరో: దళపతి విజయ్‌ కథానాయకుడిగా, దర్శకుడు హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘జన నాయగన్‌’ చిత్రానికి సెన్సార్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈ సినిమాకు ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తాజాగా రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని కేసును తిరిగి సింగిల్‌ బెంచ్‌కే రిఫర్‌ చేసింది.

మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలోని అంశాలపై సెన్సార్‌ బోర్డుకు (CBFC) తన వాదనలు వినిపించేందుకు పూర్తిస్థాయిలో న్యాయపరమైన అవకాశం కల్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ చిత్రాన్ని రివైజింగ్‌ కమిటీకి పంపాలన్న నిర్ణయం సరైనదా? కాదా? అనే అంశాన్ని సింగిల్‌ జడ్జి స్వతంత్రంగా, స్వేచ్ఛగా పరిశీలించాలని సూచించింది. ఈ కేసులోని అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని, మరోసారి సమగ్ర విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసే అధికారం సింగిల్‌ బెంచ్‌కు ఉందని స్పష్టం చేసింది.

Read More “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సక్సెస్.. మెగా విక్టరీ సెలబ్రేషన్స్

వివాదం నేపథ్యమిదే
‘జన నాయగన్‌’ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. జనవరి 9న ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేయాలని సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. ఈ తీర్పుపై సెన్సార్ బోర్డు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లి స్టే తెచ్చుకుంది. నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. జనవరి 21న వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌, సోమవారం తీర్పును వెలువరిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను రద్దు చేసింది.

అభిమానుల్లో ఆందోళన
విజయ్ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ‘జన నాయగన్‌’ విడుదలపై ఈ న్యాయపోరాటం నీలి నీడలు కమ్ముకున్నాయి. కోర్టు విచారణలు, సెన్సార్ సర్టిఫికెట్ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో సినిమా విడుదల మరింత వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.