ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది.

విశ్వంభర, బ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడైనా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో తక్షణమే భారతీయులు ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని ప్రభుత్వం కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు  భారతీయులెవరూ ప్రస్తుతం ఇరాన్‌కు వెళ్లవద్దని, అన్ని రకాల ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది.ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం లేదా జహేదాన్‌లోని కాన్సులేట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గగనతల మూసివేత లేదా రవాణా నిలిపివేత వంటి పరిస్థితులు తలెత్తక ముందే సురక్షితంగా బయటపడాలని కేంద్రం భావిస్తోంది. "ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న మన పౌరులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు." అంటూ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.

Read More ఉక్రెయిన్‌కు షాకిచ్చిన స్లొవేకియా..!

ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 5,000 నుండి 10,000 మంది వరకు భారతీయులు (ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉద్యోగులు) ఉన్నట్లు అంచనా. ఒకవేళ యుద్ధం మొదలైతే వారిని తరలించడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 'ఆపరేషన్ అజయ్' లేదా 'ఆపరేషన్ కావేరి' తరహాలో పెద్ద ఎత్తున తరలింపు అవసరం కాకుండా, ముందుగానే అప్రమత్తం చేస్తోంది.