చెవిలో చీము కారుతుందని ఆసుపత్రికి వస్తే .. యువకుడి ప్రాణం పోయింది

చెవిలో చీము కారుతుందని ఆసుపత్రికి వస్తే .. యువకుడి ప్రాణం పోయింది

  • ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం 
  • మృతదేహంతో బంధువుల ఆందోళన  

విశ్వంభర, నిజామాబాద్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా తయారైంది ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని తీరు. చెవిలో చీము కారుతుందని ఆసుపత్రికి వస్తే యువకుడి ప్రాణం పోయింది. ఆసుపత్రి వైద్యుని నిర్వాకం వల్లే యువకుడు చనిపోయాడని  బంధువులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో తో ఆందోళన చేపట్టారు. భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ (23) మంగళవారం ఉదయం 10 గంటలకు చెవిలో చీము కారడంతో జిల్లా కేంద్రంలోని ద్వారకా హాస్పిటల్లో చేరారు. అతనిని పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసేందుకు నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అజయ్ కి శస్త్ర చికిత్స చేశారు. కానీ సర్జరీ జరిగిన తరువాత పేషంటుకు మెలుకువ రాలేదు. దీంతో డాక్టర్ హుటాహుటిన పేషెంట్ అజయ్ ని సమీపంలో ఉన్న హోప్ ఆస్పత్రికి తరలించారు. అజయ్ ని పరీక్షించిన హోప్ ఆసుపత్రి వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కసారిగా షాక్ గురైన కుటుంబ సభ్యుల రోధనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు ద్వారక ఆసుపత్రి ఎదుట న్యాయం చేయాలంటూ మృతదేహంతో బైఠాయించారు. ఇంత జరుగుతున్నా  ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తమకు ఏమి పట్టనట్టు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . డాక్టర్ నవీన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రి ఎదుటే మృతదేహాన్ని దహనం చేసేందుకు డిజిల్ క్యాన్ తో రావడం కలకలం రేపింది. ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఒ రఘుపతి ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించకుండా వైద్యున్ని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ఉధృతం చేశారు.

Tags: