రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
- పారదర్శకమైన పరిపాలన అందించాలన్నదే లక్ష్యం
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో చేయనున్నాం
- సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తాం
- తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా ఈ భవనాల నిర్మాణం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహశీల్దార్ కార్యాలయాలు, ఐదు ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. రెండో విడతలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా ఈ భవనాల నిర్మాణం ఉంటుందన్నారు. బుధవారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్ని తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి? శిథిలావస్థలో పాలనకు అనువుగా లేని భవనాల వివరాలను సేకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదని, ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా రెవెన్యూ కార్యాలయాలు ప్రజలకు సౌకర్యవంతంగా లేకపోవడం, చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా, ప్రణాళికాబద్ధత లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని మంత్రి విమర్శించారు. కొన్ని మండలాలు రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించిందని మండిపడ్డారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామన్నారు. అలాగే ప్రజలకు దూరంగా కలెక్టరేట్లను నిర్మించి నిర్వహణను గాలికి వదిలేశారని విమర్శించారు.
రిజిస్ట్రేషన్ల శాఖకు అన్ని వసతులు..
రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పటాన్ చెరులో భవనాలకు శంకుస్థాపన పూర్తయిందన్నారు. గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని, మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.



