ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకం.. ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేం

ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకం.. ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేం

  • భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. 
  • ఈరెండు  ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు
  • కష్టకాలంలో ఇజ్రాయెల్  అండగా నిలిచింది
  • ఉగ్రవాదంపై పోరులో ఆ దేశం మా భాగస్వామి
  •  హమాస్‌ దాడి చేసి పౌరులను చంపడం దారుణం
  • శాంతిస్థాపన అనేది సులువైన విషయం కాదు
  • హమాస్‌ దాడుల తర్వాత మీ బాధలను మేం పంచుకున్నాం
  • ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరి విడనాడాలి
  • ఇజ్రాయెల్‌ అందించిన సాంకేతిక పరిజ్ఞానం మరచిపోలేం
  • రక్షణ, భద్రత విషయంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి
  • ఇజ్రాయెల్‌ సాయంతో భారత్‌ వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి
  • ప్రధాని నెతన్యాహూ నాకు ఆప్తమిత్రుడు
  • ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి
  • ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం.. చప్పట్లతో దద్దరిల్లిన సభ..

 ఉగ్రవాదానికి తాము పూర్తి వ్యతిరేకమని, భారత్‌ అనేక దశాబ్దాలుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రసంగించిన ఆయన.. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశానికి పూర్తిగా అండగా ఉంటామన్నారు. ఇక్కడ ప్రసంగించిన తొలి భారత ప్రధానిని తానేనని, దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. రెండోసారి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్‌, ఇజ్రాయెల్‌లు ప్రాచీన నాగరికత కలిగిన దేశాలని గుర్తుచేశారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  ఇజ్రాయెల్‌ భారత్‌కు నిజమైన స్నేహితుడు అని ప్రధాని మోడీ అన్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ఆయన ప్రసంగించారు. కష్టకాలంలో ఇజ్రాయెల్ భారత్‌కు అండగా నిలిచిందని.. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశం తమ భాగస్వామి అని చెప్పారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి భారత్‌ పూర్తిగా వ్యతిరేకమన్న ప్రధాని.. దశాబ్దాలుగా ఉగ్రవాదంతో భారత్‌ పోరాడుతోందని తెలిపారు. కాగా ఇజ్రాయెల్‌కు మోడీ రావడం సంతోషంగా ఉందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు అన్నారు. మోడీ తనకు సోదరుడిలాంటి వారని అన్నారు. తొలుత నమస్తే అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అధికార సభ్యులతో పాటు విపక్ష సభ్యులు కూడా ఆయన ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఎంతో కాలం నుంచి స్నేహబంధం ఉందని మోడీ అన్నారు. ఇజ్రాయెల్‌ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తనకు ఆప్తమిత్రుడని మోడీ అన్నారు.‘‘ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేం. హమాస్‌ దాడి చేసి పౌరులను చంపడం దారుణం. శాంతిస్థాపన అనేది సులువైన విషయం కాదు. ఇజ్రాయెల్‌కు అనేక అంశాల్లో భారత్‌ అండగా నిలుస్తుంది. హమాస్‌ దాడుల తర్వాత మీ బాధలను మేం పంచుకున్నాం. ఉనికి కోసం యూదులు అనేక కష్టాలు పడ్డారు. పాలస్తీనా సమస్యలపై స్పందించాల్సిన సమయం వచ్చింది. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరి విడనాడాలి. భారత్‌ చర్చలు, శాంతిని కోరుకుంటోంది. ఇజ్రాయెల్‌ అందించిన సాంకేతిక పరిజ్ఞానం మరచిపోలేం. రక్షణ, భద్రత విషయంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. ఇజ్రాయెల్‌ సాయంతో భారత్‌ వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి’’ అని మోడీ పేర్కొన్నారు.
మోడీ స్నేహితుడి కంటే ఎక్కువ: నెతన్యాహు
ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఎంతో సంతోషకరమని ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంటులో మోదీకి స్వాగతం పలికిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు. ఆయన మాకు స్నేహితుడి కంటే ఎక్కువ. మోదీ నేతృత్వంలో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయి. భారత్‌, ఇజ్రాయెల్‌.. ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. అనేక విషయాల్లో ఇజ్రాయెల్‌కు భారత్‌ అండగా నిలబడింది’’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
మోడీ.. మోడీ అంటూ నినాదాలు..
భారత ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌ ఎంపీలు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పార్లమెంట్‌లో మోడీకి ఘనంగా సన్మానం జరిగింది. అంతకుముందు ఇజ్రాయెల్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. టెల్‌అవీవ్‌ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ప్రధాని నెతన్యాహూ స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటిస్తారు. రెండు దేశాల మధ్య 10 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందం జరగనుంది. ముఖ్యంగా ఐరన్‌ డోమ్‌ టెక్నాలజీని అందించేందుకు ఇజ్రాయెల్‌ ముందుకొచ్చింది. తొమ్మిదేళ్ల తరువాత ఇజ్రాయెల్‌‌లో మోడీ పర్యటిస్తున్నారు. ఇరాన్‌-అమెరికా మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న వేళ మోడీ ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సతీసమేతంగా ప్రధాని మోడీకి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ స్వాగతం పలకడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రోటోకాల్‌ను పక్కనెట్టి నెతన్యాహూ ఎయిర్‌పోర్ట్‌లో మోడీని రిసీవ్‌ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోడీఇజ్రాయెల్‌ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
నెతన్యాహు- మోడీ మధ్య సరదా సన్నివేశం..
ప్రధాని నరేంద్ర మోడీ  ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. బెన్‌-గురియన్‌ విమానాశ్రయంలో దిగిన మోడీకి.. ఆ దేశ ప్రధాని నెతన్యాహు దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మోదీ కోటు పాకెట్‌ స్క్వేర్‌ రంగు, తన సతీమణి సారా ధరించిన డ్రెస్సు రంగు.. రెండూ మ్యాచ్‌ అవుతున్నట్లు నెతన్యాహు గుర్తించారు. ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.అనంతరం నెతన్యాహుతో మోడీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపినట్లు మోడీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. సాంకేతికత, జలవనరుల నిర్వహణ, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ పరిణామాల గురించి కూడా మాట్లాడినట్లు చెప్పారు. అంతకుముందు ప్రవాస భారతీయుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు.

Read More ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన

Tags: