‘ది కేరళ స్టోరీ-2’ ప్రదర్శనను నిలిపివేయాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : కేరళ రాష్ట్రంపై కల్పిత కథనాలతో విద్వేషాన్ని రగిలించేలా రూపొందించిన ‘ది కేరళ స్టోరీ-2’ చిత్రాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ , డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ, వాస్తవాలకు పొంతనలేని కథనాలతో ఒక వర్గాన్ని కించపరుస్తూ మతపరమైన వైషమ్యాలు పెంచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఇటువంటి చిత్రాలు దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. కెవిపిఎస్, గిరిజన సంఘం, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా విద్వేష రాజకీయాలకు ఊతమిచ్చే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సెన్సార్ బోర్డు జోక్యం చేసుకుని చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



