ఓఆర్‌ఆర్ అసంపూర్తి పనులకు గత ప్రభుత్వ అసమర్థతే కారణం
- ఎంపీ రఘునందన్ రావు
విశ్వంభర, పటాన్ చెరు: కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు పనులను అసంపూర్తిగా వదిలేయడం గత పదేళ్ల ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు ఎగ్జిట్ నంబర్ 2 వద్ద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, మహానగరానికి మణిహారంగా భావించే ఓఆర్‌ఆర్‌లో ఎగ్జిట్-2 వద్ద నెలకొన్న సమస్యల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్రోచ్ రోడ్డుకు కనెక్టివిటీ లేకపోవడం, రైల్వే లైన్ సమస్యల కారణంగా ఇక్కడ సర్వీస్ రోడ్డు పనులు దశాబ్ద కాలంగా అసంపూర్తిగానే ఉన్నాయని గుర్తు చేశారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు, అప్పట్లో ఈ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు అని విమర్శించారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత ప్రత్యేక చొరవ తీసుకుని, అన్ని శాఖలను సమన్వయం చేసి, అవసరమైన నిధులు మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు. డిసెంబర్ నెలాఖరు కల్లా అన్ని పనులను పూర్తి చేసి, ఎగ్జిట్-2 సర్వీస్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



