సేవాలాల్  జయంతి నిర్వహణపై నిర్లక్ష్యం తగదు 

సేవాలాల్  జయంతి నిర్వహణపై నిర్లక్ష్యం తగదు 

విశ్వంభర, భద్రాచలం: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అధికారికంగా నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుందని సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ఆరోపించారు. గిరిజన సంక్షేమానికి బాధ్యత వహించే ఉన్నతాధికారులు జయంతి కార్యక్రమాలను పట్టించుకోకపోవడం గిరిజన సమాజానికి అవమానకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 2.50 కోట్ల నిధులు కేటాయించిందని, వేడుకల నిర్వహణకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో కమిటీలు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు అనేక జిల్లాలు, మండలాల్లో అధికారులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేసి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నప్పటికీ, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం విచారకరమని అన్నారు.గిరిజన సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్లక్ష్యం చేయడం తగదని, ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సేన నాయకులు విజ్ఞప్తి చేశారు.

Tags: