విదేశీ నియామకాల కోసం అభ్యర్థులను సిద్ధం చేసేలా శిక్షణ
- విదేశీ భాషలపై శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు
- పాస్‌పోర్ట్ సేవలు, ఇమిగ్రేషన్ విధానాల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యవసరం
- విదేశీ నియామకాల కోసం అభ్యర్థులను సిద్ధం చేసేలా బలమైన వ్యవస్థ అవసరం
- మంత్రి వివేక్‌వెంకటస్వామి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను పెంచేందుకు నైపుణ్య శిక్షణ, కోర్సుల ఎంపిక, పాస్‌పోర్ట్ సేవలు, ఇమిగ్రేషన్ విధానాల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యవసరమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖా ఉన్నతాధికారులతో సమావేశమైన సాంకేతిక నైపుణ్యాలతో పాటు విదేశీ భాషలపై శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. విదేశీ నియామకాల కోసం అభ్యర్థులను సిద్ధం చేసేలా మెంటర్లు, కెరీర్ గైడ్లతో కూడిన బలమైన వ్యవస్థ అవసరమన్నారు. ప్రొఫెషనల్ కోర్సులతో పాటు భాషా శిక్షణా సదుపాయాలను విస్తరించడం ద్వారా విదేశీ ఉద్యోగాల్లో నియామకాలు గణనీయంగా పెరుగుతాయని వివరించారు. ఈ ప్రతినిధి బృందంలో సెక్రటరీ శ్రీప్రియ రంగనాథన్, జాయింట్ సెక్రటరీ, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ సురిందర్ భగత్ , ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అజిత్ జాన్ జాషువు పాల్గొన్నారు. అనంతరం శ్రీ ప్రియా మాట్లాడుతూ విదేశీ ఉపాధి ఆశిస్తున్న విద్యార్థులకు నిర్మిత శిక్షణ అందించేందుకు సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉపాధి ప్రోత్సాహంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. విదేశాలకు వెళ్తున్న యువతకు సాంస్కృతిక అవగాహన కల్పించడం భారత ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని పేర్కొన్నారు.కార్పొరేట్ శిక్షణా సంస్థలను విదేశీ భాగస్వాములతో అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, అంతర్జాతీయ భాగస్వాముల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్రమ వలసలను అరికట్టడం ప్రభుత్వాల ప్రాధాన్య అంశమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసే సర్టిఫికేషన్లను కేంద్ర సంస్థల ద్వారా ధృవీకరించే విధంగా సమన్వయం అవసరమని తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి దాన కిశోర్ టామ్‌కామ్ చేపడుతున్న కార్యక్రమాలపై వివరించి ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలతో ప్రొఫెషనల్స్‌ను తయారు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జారీ చేస్తున్న పలు సర్టిఫికేషన్లు ఇప్పటికే నేషనల్కౌన్సిల్ఫర్వేకేషన్ఎడ్యుకేషన్ట్రైనింగ్(ఎన్‌సీవీఈటీ) వంటి కేంద్ర సంస్థల గుర్తింపు పొందినట్లు తెలిపారు. పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ, అలాగే పాస్‌పోర్ట్ దరఖాస్తు సమయంలో సురక్షిత, చట్టబద్ధ వలస విధానాలపై అవగాహన కల్పించే అంశాలపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించారు.



