నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- రజక సంఘం డిమాండ్
- కొత్తగూడెంలో కొవ్వొత్తుల ర్యాలీ
విశ్వంభర, కొత్తగూడెం: నాగర్ కర్నూల్ జిల్లా ఉమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల పసిపాప మృతి చెందడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ విషాద ఘటనపై స్పందించిన రజక సంఘం నాయకులు, కుల వివక్ష , సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పసిపాప ప్రాణం పోవడం అత్యంత దురదృష్టకరం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని, సామాజిక సమానత్వం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రజక సంఘం డిమాండ్ చేసింది. కొత్తగూడెం పట్టణంలోని సూపర్ బజార్ వద్ద ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీ బస్టాండ్‌లోని అమరవీరుల స్థూపం వరకు కొనసాగింది. అనంతరం చిన్నారికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. వివిధ వర్గాల ప్రజలు సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకురాళ్లు సత్తెనపల్లి విజయలక్ష్మి, ధనలక్ష్మి, డిహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కరిష రత్నకుమారి, మైనార్టీ నాయకురాలు కైసర్ తదితరులు పాల్గొన్నారు.



