ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల రద్దీ కనిపించింది. మొదటి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు నిషేధం విధించారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని, నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.



